ఖుష్‌బూ కెరీర్‌ను అనూహ్యమైన మలుపు తిప్పిన సంవత్సరంగా 1991ను పేర్కొనాలి. ప్రభు జోడీగా ఆమె నటించిన తమిళ చిత్రం 'చిన్నతంబి' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇదే సినిమా తర్వాత వెంకటేశ్-మీనా జంటగా 'చంటి' పేరుతో రీమేక్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'చిన్నతంబి'లో ఖుష్‌బూ నటన తమిళ ప్రేక్షకులను అమితంగా అలరించింది. "ప్రతి జిల్లాలో ఆ సినిమా సక్సెస్‌ను వేడుకలా జరిపారు. నేను ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు వందలమంది ఫ్యాన్స్ నా పోస్టర్స్ పట్టుకొని, నా పేరుతో ఒక్కపెట్టున నినాదాలు చేశారు. నేను భయపడిపోయి, వెనక్కి తిరిగి ఎయిర్‌పోర్ట్‌లోకి పరిగెత్తాను. ఆ తర్వాతే వారంతా నా ఫ్యాన్స్ అనీ, నామీద ప్రేమను ప్రదర్శించడానికే వచ్చారనీ అర్థమైంది." అని గుర్తుచేసుకున్నారు ఖుష్‌బూ.
ఆ తర్వాత రోజుల్లో చెన్నై, బోట్ క్లబ్‌లో ఉన్న ఖుష్‌బూ కొత్త ఇంటికి బస్సుల్లో రావడం ప్రారంభించారు అభిమానులు. వారు ఆమెకు గుడులు కట్టారు. రక్తంతో ఆమెకు ఉత్తరాలు రాసిన అభిమానులు ఎందరో. బాలచందర్, భారతీరాజా లాంటి దర్శకులతో, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్లతో కలిసి పనిచేసే అవకాశాలు ఆమెకు లభించాయి. ప్రొఫెషనల్‌గా ఇంతటి గ్రాండ్ సక్సెస్ చవిచూసిన ఖుష్‌బూ వ్యక్తిగత జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. వివాహితుడైన ఒక స్టార్‌తో ఆమె ప్రేమలో పడ్డారు.
ప్రభుతో ఆమె అనుబంధం గురించి ఇండస్ట్రీ అంతా కోడై కూసింది. ప్రభును ఆమె తొలిసారి కలిసిన సమయంలో ఆమె తెలుగు, కన్నడ సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు. ఒకసారి చెన్నైలోని డాక్టర్ నాయర్ రోడ్డు మీద నుంచి కారులో వెళ్తుండగా, దేవర్ ఫిలిమ్స్ ఆఫీస్ దగ్గర ఆమె మేకప్‌మేన్‌కు ప్రభు కనిపించాడు. అతడిని కలవాల్సిందిగా మేకప్‌మేన్ సలహా ఇవ్వడంతో, సరేనని కలిసింది ఖుష్‌బూ. ఆ కలయిక ఆమెకు ఓ మంచి పాత్రను చేసే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో అతడితో ప్రేమలో పడటానికీ దారితీసింది.
1989లో ప్రభును తొలిసారి కలిస్తే, 1991లో 'చిన్నతంబి' చేసే సమయంలో అతడిపై పిచ్చి ప్రేమలో మునిగిపోయారు ఖుష్‌బూ. కానీ వారి వ్యవహారం ప్రభు కుటుంబానికి ఏమాత్రం రుచించలేదు. 1993లో ఒక పాపులర్ తమిళ డైలీలో ఈ వార్తను ఫ్రంట్ పేజీలో ప్రచురించారు. అప్పుడందరూ ఆమెను తిట్టేవారే, విమర్శించేవారే. ఒక చక్కని సంసార జీవితంలో ఖుష్‌బూ నిప్పులు పోస్తోందని ఆడిపోసుకున్నవారే. ఆ క్రమంలో ఆమెను ఏకంగా ఐదు సినిమాల నుంచి తొలగించారు. ఇండస్ట్రీ ఆమె పట్ల నిర్దయగా వ్యవహరించింది. దాంతో ప్రభుతో తన అనుబంధాన్ని తెంచేసుకుంది ఖుష్‌బూ. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలిచింది బాలచందర్, హీరో కార్తీక్ లాంటి అతి కొద్దిమందే.
ఏదేమైనా ఇప్పుడు ఖుష్‌బూ, ప్రభు ఎవరి సంసార జీవితాన్ని వారు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గడుపుతున్నారు. అంతేకాదు, ఒకరి కుటుంబాన్ని మరో కుటుంబం గౌరవిస్తూ వస్తోంది కూడా. ప్రభు ఇప్పుడు ఖుష్‌బూకు ఒక మంచి స్నేహితుడు. డైరెక్టర్ సి. సుందర్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు ఖుష్‌బూ. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు. సుందర్ దర్శకత్వంలో ప్రభు నటించాడు కూడా.